
మా హీరో అబ్బాస్ పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు....అతని వైఖరి కారణంగా ఆర్ధికంగా ఎంతో నష్టపోయాం...అంటూ'బ్యాంక్' చిత్ర సహ నిర్మాత బలిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో ఆయన మాట్లాడుతూ 'నిజానికి..అబ్బాస్ కి ఒప్పందం ప్రకారం ఆయన పారితోషికాన్ని షూటింగ్ మధ్యలో చెల్లించాం.అయితే ఆ తర్వాత మరో నాలుగు లక్షల రూపాయలు చెల్లిస్తే కానీ షూటింగ్‌కు రానని బెదిరించడంతో మధ్యలో సినిమా ఆగిపోకూడదనే అభిప్రాయంతో ఆ డబ్బు ఇచ్చాం. చివరిలో ప్యాచ్‌వర్క్ షూటింగ్‌లో పాల్గొనడానికి మరో రెండు లక్షలు ఇచ్చాం. సినిమా ప్రమోషన్‌కి సహకరించమని అడిగితే అప్పుడు సరేనన్నారు.తర్వాత 'రామ్‌దేవ్' చిత్రం షూటింగ్‌లో ఆయన ఉన్నప్పుడు వెళ్లి అడిగితే రానని చెప్పేశారు. పైగా 'నాకు మానవత్వం లేదే.. డబ్బే ముఖ్యం' అని కూడా అన్నారు. మా దర్శకుడు అరుణ్ కుమార్‌ని అనరాని మాటలు అన్నారు. ఇలా అబ్బాస్ వల్ల మేం పడిన ఇబ్బందులు ఎన్నో. సెట్‌లో సాంగ్ చిత్రీకరించడం కోసం అన్ని సిద్ధం చేసుకుని ఉంటే నెల రోజుల పాటు షూటింగ్‌కి రాకుండా ఏవో కారణాలు చెప్పి గైరు హాజరయి, మమ్మల్నెంతో ఇబ్బంది పెట్టారు. ఇక మా హీరోయిన్ అర్చన కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టింది. తెలుగు హీరోయిన్ కదా అని మేం తీసుకుంటే మాకు చుక్కలు చూపించింది.ఇక షూటింగ్ సమయంలోనే కాదు విడుదలకు ముందు కూడా ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం సహకరించలేదు. రెండు నెలల పాటు ఆమె ఇంటి చుట్టూ తిరిగిన తర్వాత మా మీద కొంచెం కనికరం చూపించి సినిమా చూసిన తర్వాతే ప్రమోషన్ వర్క్‌లో పాల్గొంటానని చెప్పడంతో ఆమె కోసం ప్రత్యేకంగా షో వేశాం. దానికి ఆమె రాలేదు. వాళ్ల అమ్మగారిని పంపింది... అది కూడా మేం ఎన్నో సార్లు ఫోన్ చేసిన తర్వాత. ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించే ఆర్టిస్టులను పెట్టుకుని సినిమాలు తీసే నిర్మాతలకు మనోవేదన తప్ప మరేం ఉంటుంది?' అని ఆయన ఆవేదనతో అన్నారు. ఈ నటీనటుల కారణంగా అనుకున్న బడ్జెట్ పెరిగిపోయి, చివరిలో మేం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చింది అన్నారు.
No comments:
Post a Comment